అల్లాహ్ అంటే ఎవరో తెలుసా ? అల్లాహ్ ముస్లిం ల దేవుడా ?

     -----------------------------------------------------------------------------
అల్లాహ్ అంటే ఎవరు ? 
    -----------------------------------------------------------------------------
భూమినిఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని
ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్కా తీసుకుంటాడో.

ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు


అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు  అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం.
కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు.
 వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'

దివ్య ఖుర్ఆన్  (30:40) వాక్యం ప్రకారం 

అల్లాహ్‌యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్‌కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించినవారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటికల్పించే భాగ స్వాములకంటే ఆయన మహోన్నతుడు                                                                               ఖుర్ఆన్  (30:40)
   
     -----------------------------------------------------------------------------

    అల్లాహ్ (సృష్టికర్త) యొక్క లక్షణాలు ఏమిటి ..... ?

     -----------------------------------------------------------------------------

1:  ఆయన ఒక్కడే (అద్వితీయుడు)  ఖుర్ ఆన్  (112:1)
2: ఆయనకు ఆది, అంతం, పుట్టుక, మరణము, లేదు.    
దివ్య ఖుర్ ఆన్  (112:3; 28:88)
3: ఆయన అగోచరుడు (కంటికి కనిపించడు). ఖుర్ ఆన్  (6:103)
4: ఆయనకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు  ఉండరు.            
  దివ్య ఖుర్ ఆన్  (6:101;  112:3)
5: ఆయనకు సరిసమానులు, సాటి, మేటి  ఎవ్వరూ లేరు.        దివ్య ఖుర్ ఆన్  (112:4)
6: ఆయనకు ఎటువంటి ప్రతిమ లేదు ఆయనను పోలినది ఈ సృష్టిలో ఏదీలేదు.    ఉదా :-  విగ్రహము, చిత్ర పటము     ఖుర్ ఆన్  (42:11)        7: ఆయనకు  ఆకలిదప్పులు, నిద్ర అలసట లాంటి బలహీనతలు ఉండవు  ఆయన దేనిపైన ఆధారపడేవాడు కాదు                                                                                              దివ్యఖుర్ఆన్  (2:255; 112:2)
8: ఆయన ఏదైనా చేయాలనుకుంటే కేవలం అయపో  అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే అది అయిపోతుంది.    దివ్యఖుర్ఆన్  (2:117)                          9: ఆయన  భూమిపైన (మానవరూపంలో) అవతరించడు. దైవదూతలను సందేశ నిమిత్తం అవతరింపచేస్తాడు   
                                                                     దివ్యఖుర్ఆన్  (97:4)
 10: ఆయన సప్తాకాశాలకు  పైన సృష్టి సామ్రాజ్యపీటము (అర్ష్) ను అధిష్టించి ఉంటాడు.                                     దివ్యఖుర్ఆన్  (20:5)                                                                                   
  గమనిక:- అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని  చెప్పడం తప్పు. ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు.  కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను  కళ్ళారా చూసే  అదృష్టం (అవకాశం)  లభిస్తుంది.                                      ----------------------------------------------------------------------------


విశ్వప్రభువుకు శోభాయమనమైన పేరు అల్లాహ్

-----------------------------------------------------------------------------      దేవుడికి ఎన్నోపేర్లున్నా అల్లాహ్ అనే పదానికి చాలా ప్రత్యేకత ఉంది .
ఉదా :
1) దేవుడు (God ), అనే పదాలకు దేవుళ్ళు ,God's  అనే బహువచన పదాలు ఉన్నాయి. కానీ , అల్లాహ్ అనేది ఏకవచన పదము. దీనికి బహువచనము లేదు.
2) దేవుడు, God అనేటువంటి పదాలు పురుషలింగానికి కానీ సంభందించినది కాదు.
3) దేవుడు, God  అనేటువంటి పదాలు ఈ రోజు విగ్రహాలకు, చిత్రపటాలకు, మనష్యులకు, జంతువులకు, చెట్లకు, పుట్టలకు కూడా ఉపయోగిస్తున్నారు. కానీ అల్లాహ్ అనేటువంటి పదాన్ని కేవలం అగోచరుడైనటువంటి ఆ నిజదేవుడుకి మాత్రమే ఉపయోగిస్తారు.
(మనష్యుల, జంతువులవంటి సృష్టిరాశుల ప్రతిమలకు ఉపయోగించరు).

   -----------------------------------------------------------------------------
అల్లాహ్ ముస్లింల దేవుడా.....?  
-----------------------------------------------------------------------------
ఖుర్ఆన్ లో  ఎక్కడ  కూడా అల్లాహ్  ముస్లింలకు మాత్రమే దేవుడని ప్రస్తావించబడలేదు . 
ఉదా :- ఖుర్ఆన్ లో రబ్బిల్  ఆలమీన్ (సర్వసృష్టికీ  ప్రభువు ) (1:1); రబ్బిన్నాస్  (సమస్త  మానవుల  ప్రభువు ) (114:1); ఇలాహిన్నాస్  (సమస్త  మానవుల ఆరాధ్యుడు ) (114:3); అని  వ్రాయబడి  వుంది  కానీ   రబ్బిల్  ముస్లీమీన్ (ముస్లింల ప్రభువు ) అని ఎక్కడా  లేదు. కావునా ఖుర్ఆన్ ప్రకారం  అల్లాహ్ ముస్లింలకు మాత్రమే కాదు ఆయన  సర్వమానవాళికి  దేవుడు . 

-----------------------------------------------------------------------------
 ఖుర్ఆన్ ముస్లింల కోసం అవతరించిందా.....?
-----------------------------------------------------------------------------
ఖుర్ఆన్ ముస్లింల గ్రంథమని  ఎక్కడా  రాయబడి లేదు.  ఖుర్ఆన్  సర్వమానవాళి  కోసం  అవతరించింది  అని స్వయంగా  ఖుర్ఆన్ సాక్ష్యమిస్తుంది . 
ఉదా :- సర్వ మానవులకు  ఇదొక (ఖుర్ఆన్)  సందేశం. అందరినీ హెచ్చరించాలని , అందరూ  యధార్ధదంగా దేవుడు ఒక్కడే  అని తెలుసుకోవాలని ,బుద్ది  వున్నవాడు  గ్రహించాలని  ఇది  పంప బడింది.   దివ్యఖుర్ఆన్ (14:52);
మానవులందరికీ  మార్గదర్శకం. ఋజుమార్గం  చూపే సత్యాఅసత్యను  వేరుపరిచే  స్పష్టమైన ఉపదేశాలు  దీనిలో వున్నయి .                                   దివ్యఖుర్ఆన్ (2:185)
-----------------------------------------------------------------------------

అల్లాహ్ పై విశ్వాసం అంటే ఏమిటి ?
షేఖ్ ఇబ్నె ఉథైమీన్

‘అల్లాహ్ పై నిజమైన విశ్వాసం చూపడం’ యొక్క అనేక శుభాల గురించి నేను చదివాను మరియు విన్నాను. స్పష్టంగా అర్థం చేసుకునేలా, చిత్తశుద్ధితో ఆచరించేలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరుల పద్ధతికి భిన్నంగా ఉండే ప్రతి దాని నుండి నన్ను దూరంగా ఉంచేలా ‘అల్లాహ్ పై విశ్వాసం’ గురించి వివరించమని మిమ్ముల్ని వేడుకుంటున్నాను. 
అల్హందులిల్లాహ్.
‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే ఆయన ఉనికిని, ఆయన దైవత్వాన్ని, ఆయన శుభనామాలను మరియుదివ్యలక్షణాలను దృఢంగా విశ్వసించడం.
అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు.
1 – అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించడం. 
‘అల్లాహ్ యొక్క ఉనికి’ హేతుబద్ధంగా మరియు మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం. దీనిని షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు నిరూపిస్తున్నాయి.
(i)  అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:
తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరం లేక నేర్చుకోవలసిన అవసరం లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో చేసి వేస్తారు.”  [సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం.]
(ii) అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు:
భూత, భవిష్య మరియు వర్తమాన కాలాలలోని ఈ సృష్టితాలన్నీ తమను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే అవి తమను తాము సృష్టించుకోలేవు లేదా ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాజాలవు.
అవి తమకు తాముగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు?! అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైన మరియు అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది. మరియు ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?
ఒకవేళ ఇవి తమకు తాముగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి ఉండాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.
అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరహ్ అత్తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):
“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” [అత్తూర్ 52:35]
అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అత్తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):
“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ”  [అత్తూర్ 52:35-37]
ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవాడు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత అతడిలా పలికినాడు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” సహీహ్ అల్ బుఖారీ.
మరింత స్పష్టంగా వివరించే ఒక ఉదాహరణ క్రింద పేర్కొంటున్నాము:
ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు – ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. మరియు అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరి, భూమ్యాకాశాలతో, నక్షత్రాలతో మరియు అత్యద్భుత, సవిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?!
ఏడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశకు అతడు చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారు పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” అతడి జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”
2 – అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని విశ్వసించడం. 
అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు – ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు.
సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఇలా పేర్కొనబడినాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”  [అల్ అరాఫ్ 7:54]
“ప్రకటించు(ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరియు మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’”  [యూనుస్ 10:31]
“భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది” [అస్సజదహ్ 32:5]
“ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.” [ఫాతిర్ 35:13]
సూరతుల్ ఫాతిహా లోని అల్లాహ్ పలుకులు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“తీర్పుదినం (ప్రతిఫల దినం, అంతిమ దినం) యొక్క (ఏకైక) ప్రభువు [మాలికి యౌమిద్దీన్]” [అల్ ఫాతిహా 1:4]
మరో పద్ధతిలో ఇది మలికి యౌమిద్దీన్ అని పఠించబడుతుంది. ఒకవేళ మనం ఈ రెండు పఠనా పద్ధతులను జత చేస్తే, ఒక అద్భతమైన భావం మన ముందుకు వస్తుంది – మాలిక్ (యజమాని) కంటే మలిక్ (సార్వభౌముడు) ఎక్కువ శక్తి మరియు అధికారం కలిగి ఉంటాడు. అయితే ఒక్కోసారి పేరుకు మాత్రమే అతడు రాజుగా చెలామణీ అవుతాడు, రాజ్యవ్యవహారాలపై అతనికెలాంటి నియంత్రణా, ఆధిపత్యమూ ఉండదు. అలాంటి స్థితిలో అతడు కేవలం నామ మాత్రపు రాజే గాని యజమాని కాడు. అయితే, అల్లాహ్ సార్వభౌముడు మరియు యజమాని కూడా అయి ఉండటం వలన, ఆయన యొక్క సార్వభౌమత్వం మరియు విశ్వవ్యవహారాలన్నింటిపై ఆయన యొక్క సాటి లేని నియంత్రణను ఇది ధృవీకరిస్తున్నది.
3 – అల్లాహ్ యొక్క ఏక దైవత్వాన్ని విశ్వసించడం 
i.e., కేవటం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.
అల్ ఇలాహ్ అంటే ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“మరియు మీ ఆరాధ్యుడు – ఒక్కడే. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. అనంత కరుణా మయుడు మరియు అపార కృపాశీలుడు” [అల్ బఖరహ్ 2:163]
“ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.” [ఆలె ఇమ్రాన్ 3:18]
అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దాని యొక్క దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్న వన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.” [అల్ హజ్  22:62]
దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు” [అల్ నజమ్ 53:23]
యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఇలా పలికినట్లు అల్లాహ్ మనకు తెలిపినాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం:
“అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.” [12:39-40]
అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు. ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు – ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినా, ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ఏ ప్రవక్త అయినా. ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం:
“’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు” [అల్ అంబియా 21:35]
“నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.” [అన్నహల్ 16:36]
అయితే, బహుదైవారాధకులు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి మరియు అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.
4 – అల్లాహ్ యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను విశ్వసించడం. 
i.e., తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, ఆయనకు ప్రయోజనం కలిగేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులు – చేర్పులు చేయకుండా, వాటిని సృష్టితాలతో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా మనం కూడా ధృవీకరించడం. ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం:
“అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ అరాఫ్ 7:180]
ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ యొక్క నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.
మరియు అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు. (ఖుర్ఆన్ వచనం యొక్క తెలుగు భావానువాదం):
“భూమ్యాకాశాలలో ఆయన ప్రస్తావనయే అత్యున్నతమైన ప్రస్తావన. ఆయన మహోన్నతుడు, అత్యంత వివేకవంతుడు” [అర్రూమ్ 30:27]
పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”. ఈ రెండు వచనాలు సూచిస్తున్నదేమిటంటే, అత్యంత ఉన్నతమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు సాధారణంగా అల్లాహ్ కు మాత్రమే చెందును. ఖుర్ఆన్ మరియు సున్నతులలో దీనిని వివరంగా తెలిపే సమాయారం చాలా ఎక్కువ మోతాదులో ఉంది.
జ్ఞానం యొక్క ఈ విభాగం అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను వివరించే జ్ఞానం గురించి సమాజంలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇది చాలా వివాదాస్పదమైన విభాగం. దీని విషయంలో సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది.
దీని గురించి అల్లాహ్ పంపిన ఈ ఆదేశాలను తు.చ. తప్పక శిరసావహిచాలనేది మా అభిప్రాయం.  (ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం) :
“ఏదైనా విషయం గురించి మీలో మీకు భేదాభిప్రాయాలు వస్తే, దానిని అల్లాహ్ మరియు ఆయన యొక్క సందేశహరుడి వైపుకు మరలండి – ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే.” [అన్నిసాఅ 4:59]
మనం ఈ భేదాబిప్రాయాన్ని కూడా అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథం మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకే మరలిద్దాం – సన్మార్గంలో నడిచిన సలఫ్ (ముందుతరం), సహాబాలు, తాబయీన్ ల నడిచిన మరియు ఈ ఖురఆన్ ఆయతులు మరియు హదీథులు అర్థం చేసుకున్న విధానం నుండే మనం కూడా ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అన్వేషిస్తూ. ఎందుకంటే ఈ సమాజంలో వారు అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన విషయాలలో అత్యుత్తమ జ్ఞానవంతులు. సహాబాల గురించి వివరిస్తూ, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు తన సత్యవాక్కులను ఇలా తెలిపారు: “ఎవరైనా సన్మార్గాన్ని అనుసరించాలనుకుంటే, (తమ జీవితాంతం సన్మార్గంపై నడుస్తూ) మరణించిన సజ్జనుల మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే ప్రస్తుతం జీవించి ఉన్న సజ్జనుల విషయంలో చివరి క్షణం లోపల వారు సన్మార్గాన్ని వదిలి పెట్టరనే గ్యారంటీ ఏదీ లేదు. సహాబాలు ఎంత గొప్ప వారంటే, వారి హృదయాలు మన సమాజంలో మిగిలిన వారందరి కంటే అతి స్వచ్ఛమైనవి, లోతైన అవగాహనను కలిగి ఉండినవి,  ఆడంబరాలకు దూరంగా ఉండినవి, అతి తక్కువ క్లిష్టమైనవి. అంతేగాక అల్లాహ్ వారిని తన ధర్మ స్థాపన కొరకు మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహచరులుగా ఉండుట కొరకు ఎంచుకున్నాడు. కాబట్టి వారి హక్కును మనం తప్పక గుర్తించాలి. మనం వారి మార్గదర్శకత్వాన్ని తప్పక స్వీకరించాలి. ఎందుకంటే వారు నిజమైన మార్గదర్శకత్వాన్ని అనుసరించారు.” ఎవరైతే ఈ విషయంలో సలఫ్ మార్గాన్ని వదిలి, వేరే మార్గాన్ని అవలంబిస్తారో, వారు తప్పు చేసినట్లే మరియు తప్పుడు దారిని అవలంబించినట్లే. అంతేగాక విశ్వాసుల (మోమిన్ల) మార్గాన్ని వదిలి, వేరే మార్గంపై నడుస్తున్న వారవుతారు. అలాంటి వారిని అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):
“స్పష్టంగా సన్మార్గం చూపబడిన తర్వాత ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుడితో విభేదిస్తారో, వారు విశ్వాసుల మార్గాన్ని కాకుండా వేరే మార్గంలో నడుస్తున్నట్లే. వారు ఎంచుకున్న (తప్పుడు) మార్గంలోనే మేము వారిని ముందుకు పోనిస్తాము మరియు నరకంలో శిక్షిస్తాము – ఎంత చెడు గమ్యం వారిది!” [అన్నిసాఅ 4:115]
సరైన మార్గదర్శకత్వాన్ని పొందాలంటే, సహాబాలు విశ్వసించినదే మనం కూడా తప్పకుండా విశ్వసించాలని అల్లాహ్ ఈ ఆయతులో స్పష్టంగా నిర్దేశిస్తున్నాడు. (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):
“కాబట్టి మీరు (సహాబాలు) విశ్వసిస్తున్నట్లుగా ఒకవేళ వారు కూడా విశ్వసిస్తే, వారు సన్మార్గంపై ఉన్నట్లే” [అల్ బఖరహ్ 2:137]
ఎవరైతే సలఫ్ మార్గం నుండి దూరమవుతారో మరియు దాన్ని వదిలి వేరే మార్గాన్ని అవలంబిస్తారో అలాటి ప్రతి ఒక్కరూ సరైన మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశం జారవిడుచుకున్న వారవుతారు మరియు దిక్కులేని వారవుతారు.
దీని ఆధారంగా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాల విషయంలో దేనినైతే స్వయగా అల్లాహ్ యే ధృవీకరించాడో మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించారో, దానినే మనం అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు సున్నతులను మనం ఆధారంగా తీసుకోవాలి, సహాబాలు వాటిని నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ విషయంలో వారు మన సమాజంలో అందరి కంటే ఎక్కువ జ్ఞానం మరియు ఉత్తమ జ్ఞానం కలిగి ఉండినారు.
అయితే మనం క్రింది నాలుగు విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఈ నాలుగు: తహ్రీఫ్ (మార్పుచేర్పులు), తఆతీల్ (తిరస్కారం), తమ్హీల్ (అల్లాహ్ ను సృష్టితాలతో పోల్చడం) మరియు తకైఫ్ (ఎందుకు, ఎలా అని చర్చించడం).
కాబట్టి, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించడమంటే “తన దివ్యగ్రంథంలో మరియు తన ప్రవక్త యొక్క సున్నతులలో అల్లాహ్ స్వయంగా ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను వాటి భావార్థాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, తిరస్కరించకుండా లేదా ఎందుకు, ఎలా అని ప్రశ్నించకుండా లేదా వాటిని సృష్టితో పోల్చకుండా ఆయన స్థాయికి తగినట్లు మనం కూడా వాటిని యథాతథంగా ధృవీకరించడం.”
మనం దూరంగా ఉంచవలసిన ఈ నాలుగు విషయాల గురించి క్లుప్తంగా ఇక్కడ చర్చించుకుందాము:
(i) తహ్రీఫ్ (మార్పులు – చేర్పులు చేయడం) 
అంటే, ‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు – చేర్పులు చేయడం.
ఉదాహరణకు:
అనేక ఆయతులలో వచ్చిన ‘అల్లాహ్ చేయి’ అనే పదం యొక్క భావార్థాన్ని వారు ఆయన యొక్క అనుగ్రహాలను లేదా శక్తిని సూచిస్తుందని మార్చడం.
(ii) తఆతీల్ (తిరస్కరించడం) 
అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ అల్లాహ్ కు చెందవని లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.
ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.
(iii) తమ్హీల్ (అల్లాహ్ ను ఆయన యొక్క సృష్టితాలతో పోల్చడం) 
అంటే, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి కూడా మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ యొక్క వినికిడి శక్తి కూడా మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది చాలా తప్పు మరియు ఒక పచ్చి అబద్ధం వంటిది. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి, (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“ఆయనను పోలినదేదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడూ, చూసేవాడూను.” [అష్షూరా 42:11]
(iv) తకైఫ్ (ఎలా సంభవమని చర్చించడం) 
అంటే, ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం.
ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):
“కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు” [తాహా 20:110]
ఎవరైనా ఈ నాలుగు విషయాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే.
మన అంతిమ ఘడియ వరకు సన్మారంలోనే నిలకడగా నడుపమని మనం అల్లాహ్ ను వేడుకుంటున్నాము.
మరియు అల్లాహ్ యే సమస్త విషయాలు ఎరుగును.
రిఫరెన్స్ : రిసాలత్ షరహ్ ఉసూల్ అల్ ఈమాన్ – షేఖ్ ఇబ్నె ఉథైమీన్.అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

No comments:

Post a Comment