Sunday 25 April 2021

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి?

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్

అనువాదం ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?

ఇది షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ‘షర్హ్ హదీథ్ జిబ్రయీల్’ అనే అరబీ పుస్తకంలోని ఒక భాగం.

విషయసూచిక

1. మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ? అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
2.  సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు : సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?
3.  పునరుత్థానం : మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు అతను తిరిగి ఎలా లేపబడతాడు ?
4. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం – అంతిమదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?
5. ప్రజల కర్మల పత్రం – ఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?
6. త్రాసు – త్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా! – అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?
9. షఫా (విముక్తి, మోక్షం) – షఫా షరతులు
10.  పుల్ సిరాత్ (వంతెన)
11. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం – స్వర్గం మరియు నరకం ఇపుడు ఉనికిలో ఉన్నాయా? – స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.

మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ?

ఖుర్ఆన్ లోని అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది, “అనంత కాలచక్రంలో మానవుడు పేర్కొనలేని స్థితిలో తాను సమయాన్ని గడపలేదా?” 76:1 (ఈ వచనంలో పేర్కొనబడిన దశ, మానవుడి మొట్టమొదటి దశ)

తర్వాత మానవుడు పిండంగా మారాడు (ఇది మానవుడి రెండో దశ). ఆ తర్వాత అతడు ఈ ప్రపంచంలో జీవించసాగాడు. (ఇది మానవుడి మూడో దశ). ఈ ప్రాపంచిక జీవిత దశ, తాను గడిపిన పిండం దశ కంటే ఎక్కువ సంపూర్ణమైంది.

(ఈ ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత) మానవుడు తన నాలుగో దశ వైపుకు అంటే బర్జఖ్ వైపుకు పయనిస్తాడు (ఇది చావుతో ప్రారంభమై, అంతిమ ఘడియ ఆరంభమయ్యే వరకు కొనసాగుతుంది). బర్జఖ్ దశలోని అతని స్థితి, ఈ ప్రాపంచిక జీవిత దశలోని స్థితి కంటే ఎక్కువ సంపూర్ణమైంది.

మానవుడు ఇంకా ముందుకు సాగుతూ తన ఐదో దశకు అంటే అంతిమ దినానికి చేరుకుంటాడు. ఈ దశలోని అతని స్థితి, అంతుకు ముందు గడిపిన దశలన్నింటి కంటే ఎక్కువ సంపూర్ణమైంది.

పై వాక్యాల వివరణ ఏమిటంటే – తన తల్లి గర్భంలో ఉన్నపుడు మానవుడు నిస్సందేహంగా ఈ ప్రాపంచిక జీవిత స్థితిలో కంటే అసంపూర్ణంగా ఉంటాడు. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ప్రకటన, “మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు). అపుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు (అల్లాహ్ కు)కృతజ్ఞులై ఉంటారని” 16:78

తన తల్లి గర్భం నుండి బయటికి రాగానే అతడికి తెలివి, వినికిడి శక్తి, దృష్టి మరియు చలనం వస్తాయి. మానవుడి ఈ ప్రాపంచిక జీవిత స్థితి ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు; శాంతి – అశాంతి, కష్టనష్టాలు, న్యాయాన్యాయాలు, మంచిచెడులు అతడి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి.

ఇపుడు మీరు యవ్వనంలో, బలిష్ఠంగా ఉన్నారు – అయితే త్వరలో మీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎదుర్కోబోతున్నారు – చావు లేక వృద్ధాప్యం. కాబట్టి ఈ ప్రాపంచిక జీవితమూ అసంపూర్ణమైనదే, అందుకనే ఇది ‘దునియా’ అనే పేరుతో పిలవబడుతున్నది (ప్రపంచం అనే అర్థమిచ్చే అరబీపదం), దీని మూలాక్షరాలు దానా (అంటే అల్పమైంది, అధమమైంది, ఉపేక్షించబడేది) మరియు దునూ  (అంటే త్వరలో నశించేది, అంతమయ్యేది). కాబట్టి, పరలోకంతో పోల్చితే ఈ ప్రాపంచిక జీవితం అతి అల్పమైంది.

ఈ ప్రాపంచిక జీవితంలో కంటే బర్జఖ్ దశలోని మానవుడి స్థితి ఎక్కువ సంపూర్ణమైంది. ఎందుకంటే బర్జఖ్ దశలో అతని స్థితి నిలకడగా ఉంటుంది. ఒకవేళ సజ్జనులలోని వాడైతే, సమాధిలో అతను అనుగ్రహించబడతాడు. అతని కంటి చూపుల మేరకు అతని సమాధి విశాలమవుతుంది, స్వర్గవనాల నుండి అలంకరించబడి ఉంటుంది మరియు స్వర్గం దిశలో అతని కొరకు ఒక ద్వారం తెరవబడుతుంది. ఈ ప్రపంచంలో దీనిని పొందడం సాధ్యం కాదు.

(పరలోక దశలోని స్థితి, పూర్వదశలన్నింటి కంటే ఎక్కువ సంపూర్ణమైంది ఎందుకంటే) పరలోకంలో మనిషి పూర్తి సంపూర్ణత్వం ప్రసాదించబడుతుంది – ఈ ప్రాపంచిక జీవితంతో ఏ విధంగానూ పోల్చబడలేని ఒక సంపూర్ణ, పరిపూర్ణ జీవితమది.

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?

అంతిమదినాన్ని విశ్వసించడమంటే మానవజాతి మరలా ప్రాణాలతో లేపబడుతుందని మరియు వారి కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతుందని విశ్వసించడం. అంతిమ దినం గురించి ఖుర్ఆన్ లో మరియు సున్నతులలో తెలుపబడిన ప్రతి దాన్నీ మనం విశ్వసించడం.

అంతిమదినం గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ చాలా విపులంగా వివరించాడు, ఉదాహరణకు – “ఓ మానవులారా! మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. ఆ రోజు ఆవరించినపుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మరచిపోవడాన్ని, ప్రతి గర్భవతి తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ ఏదో మైకంలో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ (నిజానికి) వారు (మద్యం) త్రాగి ఉండరు. కానీ అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.” ఖుర్ఆన్ 22: 1-2

ఖుర్ఆన్ మరియు సున్నతులలో ఆ రోజు యొక్క భయంకరమైన మరియు తీవ్రమైన స్వభావం గురించి సాక్ష్యమిచ్చే అనేక వివరాలు ఇవ్వబడినాయి.

క్రింద పేర్కొన్నట్లుగా అఖీదతుల్ వాసితియ్యహ్ లో షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియహ్ (ర) పునరుత్థానం తర్వాత స్థాపించబడే దినాన్ని విశ్వసించడంతోనే అంతిమ దినాన్ని విశ్వసించడమనేది పరిమితం కాదు,

“మరణం తర్వాత జరగబోయే సంఘటనల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ప్రతి విషయాన్నీ విశ్వసించడమనేది అంతిమదినాన్ని నమ్మడంలో ఇమిడి ఉంది.”

  1. సమాధి అవస్థ

మరణం తర్వాతి మొదటి మజిలీయే సమాధి అవస్థ. మృతదేహం భూమిలో సమాధి చేయబడిందా లేక సముద్రంలో విసిరి వేయబడిందా లేక సింహం తిన్నదా లేక గాలిలో కలిపి వేయబడిందా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనబోయే కఠిన పరీక్ష ఇది. ప్రతి ఒక్కరూ ఈ అవస్థను ఎదుర్కొనవలసి ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ మూడు విషయాల గురించి ప్రశ్నించబడతారు;

  1. నీ ప్రభువు ఎవరు ?
  2. నీ ధర్మం ఏది ?
  3. నీ ప్రవక్త ఎవరు ?

విశ్వాసి ఇలా జవాబిస్తాడు, ‘నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం మరియు నా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)’. అపుడు ‘ఈ దాసుడు సత్యం పలికాడు’ అని ఒక దివ్యవాణి ఆకాశాలలో నుండి ధృవీకరిస్తుంది.

అపుడు అతని కంటిచూపు పరిధి వరకు అతని సమాధి విశాలం అవుతుంది, స్వర్గాలంకరణలు అమర్చబడతాయి. స్వర్గంలోనికి ఒక ద్వారం తెరవబడి, సువాసనలు మరియు శుభాలు స్వర్గం నుండి అక్కడికి వస్తుంటాయి. ఈ స్థితి నిస్సందేహంగా అతని ప్రాపంచిక స్థితి కంటే ఎంతో సంపూర్ణమైంది.

అతని ప్రభువు గురించి, ధర్మం గురించి మరియు ప్రవక్త గురించి ప్రశ్నించ బడినపుడు, అవిశ్వాసి మరియు కపట విశ్వాసి ఇలా జవాబిస్తాడు, ‘ఓహ్, ఓహ్, నాకు తెలీదు. ప్రజలు ఏదో అనడం విన్నాను మరియు నేను కూడా అలాగే అన్నాను.’

‘ఓహ్, ఓహ్’ అనే దాని అర్థాన్ని పరిశీలించండి. ‘దాసుడికి ఏదో జ్ఞాపకం వచ్చింది, దానిని గుర్తు చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ, అది జ్ఞప్తికి రాలేదు’ అనే విషయాన్ని సూచిస్తున్నది.

జ్ఞాపకం చేసుకునే సామర్థ్యం కోల్పోవడమనేది అసలు తెలియక పోవడం కంటే ఘోరమైన బాధను కలిగిస్తుంది. ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా అడిగితే, అది నిజంగా మీకు తెలియని విషయమైతే, మీరు తేలికగా ‘నాకు తెలీదని’ జవాబిచ్చి వేస్తారు. దీనిలో సందేహించవలసిన అవసరం లేదు. అలాగే ఎలాంటి దుఃఖమూ కలుగదు. కానీ, ఒకవేళ మిమ్ముల్ని ఎవరైనా ఏదైనా విషయం గురించి అడిగితే, అది మీకు తెలిసిన విషయమే అయినా గుర్తుకు తెచ్చుకోలేకపోతే, బాధ కలుగుతుంది.

అందుకని, అవిశ్వాసి ‘ఓహ్, ఓహ్’ అని అంటాడు – తనకేదో గుర్తున్నట్లుగా – మరలా “నాకు తెలీదు. ప్రజలు ఏదో అనడం విన్నాను మరియు నేను కూడా అలాగే అన్నాను” అంటాడు.

అపుడు ఒక పెద్ద ఇనుప సుత్తితో అవిశ్వాసి బాధపడగా, అతడు పెద్దగా అరిచే అరుపు, జిన్నాతులు మరియు మానవులు తప్ప ప్రతిదీ వింటుంది – ఎందుకంటే ఒకవేళ వారే గనుక వినగలిగితే, వారు చెవిటి వాళ్ళుగా మారి పోతారు. ఆ ఇనుప సుత్తి ఎంత పెద్దగా ఉంటుందంటే, మీనా వంటి పట్టణంలోని ప్రజలందరూ కలిసి ఎత్తడానికి ప్రయత్నించినా, వారు దానిని పైకెత్తలేరు.

సమాధి అవస్థను విశ్వసించడం తప్పని సరి. ఎందుకంటే దానిని విశ్వసించడ మనేది అంతిమ దినంపై విశ్వాసంలోని ఒక భాగం.

ప్రశ్న: సమాధి అవస్థ ఈ ప్రపంచంలోనే సంభవిస్తుండగా, దానిని అంతిమదినం పై విశ్వాసంలోని భాగంగా ఎలా విశ్వసించాలి ?

జవాబు: ఒక మనిషి చనిపోయినపుడు, అతని తీర్పుదినం స్థాపించ బడుతుంది. (అలా సమాధి అవస్థ అంతిమదినంపై విశ్వాసంలోని భాగమవుతుంది)

  1. సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు

సమాధి శిక్ష మరియు దాని అనుగ్రహాలు, అంతిమ దినంపై విశ్వాసంలో కలిసి ఉన్నాయి. దీనికి ఋజువు, ఖుర్ఆన్ లోని అల్లాహ్ యొక్క ఈ వచనాలు, “వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది లభిస్తుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు. ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో; ‘సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగు గాక)! మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి’ అని అంటారు” 16:31-32

పైన పేర్కొనబడిన వచనంలోని ఋజువు పదాలు – ‘ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో; “ ‘సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగు గాక)! మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి’ ” .

వారు భూమ్యాకాశాలంతటి వెడల్పున్న స్వర్గంలోనికి ప్రవేశించరు గానీ, స్వర్గం నుండి ప్రసాదించడుతున్న అనుగ్రహాలతో కూడిన సమాధిలోనికి వెళతారు. దీని గురించి అల్లాహ్ వచనాలు ఇలా ఉన్నాయి, “అయితే (చనిపోయే వాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు మీరెందుకు ఆపలేరు. మరియు అపుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండి పోతారు. మరియు అపుడు, మేము అతనికి మీ కంటే చాలా దగ్గరలో ఉంటాము, కానీ మీరు చూడలేకపోతారు. ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞ (అధీనం) లో లేరనుకుంటారో, మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు? కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే, అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.” 56:83-89

ఇది ప్రాణం గొంతులోనికి చేరుకున్నపుడు జరిగే సంఘటన. ఈ వచనం అతని ఆత్మ బయటికి రాక ముందే అనుగ్రహాల శుభవార్త మానవుడికి ఇచ్చే బదులు,  సమాధి అనుగ్రహాన్ని పేర్కొంటున్నది. అతని ఆత్మతో ఇలా చెప్పడం జరుగుతుంది, “బయటికి రా, ఓ ప్రశాంతమైన ఆత్మా. బయటికి రా – నీ ప్రభువు క్షమాపణ కోరకు మరియు ప్రశన్నత కొరకు.” అపుడు ఆ ఆత్మ సంతృప్తి చెందుతుంది మరియు వేగంగా బయటికి వచ్చేస్తుంది.

ఇక సున్నతు నుండి ఋజువు విషయానికి వస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక హదీథులలో సమాధిలో మానవుడు అనుగ్రహాలు పొందుతాడని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటిని మేము పైన ఉదహరించి యున్నాము.

సమాధి శిక్ష కూడా ఖుర్ఆన్ వచనాల మరియు సున్నతుల నుండి ఋజువు చేయబడింది. ఫిర్ఔన్ ప్రజల గురించి అల్లాహ్ వచనాలు ఇలా ఉన్నాయి, “(ఇదిగో) అగ్ని; ప్రతి ఉదయం మరియు సాయంత్రం వారు దాని ముందుకు రప్పించబడు తుంటారు.” ఇది అంతిమ ఘడియ స్థాపించబడక మునుపే సంభవిస్తుంది.

ఇదే వచనంలో అల్లాహ్ ఇంకా ఇలా పలుకుతున్నాడు, “మరి ప్రళయం సంభవించిన నాడు, ‘ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి (అని ప్రకటించబడుతుంది).’ ” 40:46

ఇంకా ఖుర్ఆన్ లోని 6వ అధ్యాయంలో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది: “…. ఈ దుర్మార్గులు మరణయాతనలో ఉన్నపుడు, దైవదూతలు తమ చేతులు చాచి, ‘సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్ కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకు గాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది’ అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండును!” 6:93

దుర్మార్గుల ఆత్మలు వారి దేహంలో నుండి బయటికి రావడానికి వెనకాడు తుంటాయి. ఎందుకంటే శిక్ష పడబోతుందనే వార్త వాటికి తెలియజేయ బడుతుంది – దాని నుండి మేము అల్లాహ్ శరణు అర్థిస్తున్నాము. ఆత్మలు సంకోచిస్తుంటాయి మరియు తమకు వాగ్దానం చేయబడిన కఠినశిక్ష నుండి తప్పించుకోవడం కొరకు దేహంలో నుండి బయటికి రాకూడదని కోరుకుంటాయి.

“…. ఈ దుర్మార్గులు మరణయాతనలో ఉన్నపుడు, దైవదూతలు తమ చేతులు చాచి, ‘సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్ కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించ బడుతుంది’ ” ఖుర్ఆన్ వచనాల భావానువాదం 6:93

ఈ వచనంలో ఋజువు చేసే పదాలు – ‘ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది’.

ఈ వచనంలోని ‘ఈ(రోజు)’ అంటే ‘ఈ రోజు మీకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసాను’ అనే అల్లాహ్ పలుకులలో తెలిపినట్లుగా ప్రస్తుత (దినం).

కాబట్టి, ఇక్కడ ‘ఈ(రోజు)’ అంటే దుర్మార్గులు ‘మరణించే రోజు’.

ఖుర్ఆన్ లో మరో చోట అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది, “కానీ ఎవడైతే ధిక్కరించే మార్గభ్రష్టుల్లో గనక చేరిపోతే, వాడి కొరకు ఆతిథ్యంగా సలసల కాగే నీరు ఉంటుంది. నరక ప్రవేశం ఉంటుంది.” 56:92-94

నమాజులో మనం ఇలా అర్థిస్తాము,

أعوذ بالله من عذاب جهنم و من عذاب القبر

నరకాగ్ని యాతన నుండి మరియు సమాధి యాతన నుండి మేము అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాము.

కాబట్టి, ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి సమాధి యాతన ఋజువు చేయబడింది. దానిని విశ్వసించడమనేది అంతిమ దినాన్ని విశ్వసించడంలోని ఒక భాగం.

సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?

ప్రాథమికంగా సమాధి యాతనకు ఆత్మ గురి చేయబడుతుంది. అయితే అది దేహానికి కూడా చేరవచ్చు. ఏదేమైనా, శరీరంపై అసలు దాని ప్రభావమేమీ ఉండదని కాదు. అది మన కళ్ళకు కనబడక పోయినా, శరీరమూ  తప్పకుండా యాతన బాధను అనుభవిస్తుంది మరియు అనుగ్రహాల శుభాలను ఎంజాయి చేస్తుంది.

సమాధి యాతన ఈ ప్రాపంచిక యాతన లేక శుభాలకు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాపంచిక యాతన లేక శుభాలు మన శరీరంపై సంభవిస్తాయి మరియు దాని ప్రభావం ఆత్మపై కూడా పడుతుంది. అయితే బర్జఖ్ దశలోని యాతన లేక శుభాలు ఆత్మపై సంభవిస్తాయి మరియు దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది.

ప్రశ్న: అవిశ్వాసి కొరకు అతని కుడి ఎడమల ప్రక్కటెముకలు ఒక దానిలో మరొకటి జొచ్చుకునేలా సమాధి కుంచించుకు పోతుందని మీరేలా చెప్పగలరు? ఒకవేళ మనం సమాధి త్రవ్వి చూస్తే, దాని సైజులో ఎలాంటి మార్పూ మనకు కనబడదు మరియు మృతదేహం అలా జరిగిన చిహ్నాలేమీ మనకు కనబడవు కదా!

జవాబు: సమాధి యాతన ముఖ్యంగా ఆత్మపై సంభవిస్తుంది. ఇక్కడ దాని చిహ్నాలు మృతదేహం పై కనబడతాయని కాదు. ఒకవేళ అది మృతదేహంపై సంభవించేటట్లయితే, అది అగోచర విషయాల (గైబ్) పై విశ్వాసం అనే దానికి చెంది ఉండేది కాదు. అంతేగాక దాని ఎలాంటి ప్రయోజన కలిగేది కాదు. కానీ, సమాధి యాతన అనేది అగోచర (గైబ్) విషయాలకు చెందినది మరియు అది ఆత్మకు సంబంధించింది.

ఒక వ్యక్తి తన కలలో నిలుచున్నట్లు, బయటికి వెళ్ళుతున్నట్లు మరియు మరలి వస్తున్నట్లు, దేనికో గుద్దు కున్నట్లు మరియు ఎవరో అతనిని గుద్దినట్లుగా చూస్తాడు, అయితే నిజానికి ఇదంతా చూస్తున్నపుడు, అతను తన మంచం పైనే నిద్రపోతూ ఉంటాడు. అలాగే, ఎవరైనా వ్యక్తి తన మంచం పైనే నిద్రపోతున్నపుడు, తను ఉమ్రహ్ చేయడం కొరకు ప్రయాణిస్తున్నట్లు, తవాఫ్, సయీ చేస్తున్నట్లు, తన తల గొరిగించుకున్నట్లు లేక తల వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకున్నట్లు, ఆ తర్వాత తన దేశానికి మరలి వచ్చినట్లు చూడవచ్చు – ఇదంతా అతను ఎలాంటి కదలికలూ లేకుండా అతని శరీరం పక్కలోనే పడుకుని ఉండగా జరుగుతుంది. కాబట్టి, ఆత్మ యొక్క స్థితి, శరీరం యొక్క స్థితికి భిన్నమైంది.

الله يبعث الأجساد يوم القيامة حفاة عراة غرلاً

  1. పునరుత్థానం

మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుదినమున మన శరీరాలను నగ్నపాదాలతో, నగ్నంగా మరియు సుంతీ చేయబడని స్థితిలో లేపుతాడు.

నగ్నపాదాలతో: ఎలాంటి చెప్పులు, బూట్లు లేకుండా అంటే పాదాలపై పాదరక్షల వంటి ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా.

నగ్నంగా: ఎలాంటి దుస్తులూ లేకుండా

సుంతీ చేయబడని స్థితిలో: అంటే ఒడుగులు చేయబడకుండా

కొన్ని హదీథులలో ‘బుహ్మాన్’ అని పేర్కొనబడింది – అంటే ఎలాంటి సంపద లేకుండా. అక్కడ ప్రతి ఒక్కరూ తమ కర్మలను మాత్రమే కలిగి ఉంటారు.

పునరుత్థానం అంటే తిరిగి లేపబడటం, అంతేగాని కొత్తగా మరలా సృష్టించబడటం కాదు. దీని గురించి ఖుర్ఆన్ లోని అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “వారికి చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (తిరిగి) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు’” 36:79

ఒకవేళ అది కొత్త సృష్టి అయినట్లయితే, ఈ ప్రపంచంలో పాపాలు చేసిన శరీరం శిక్షల నుండి తప్పించుకుంటుంది మరియు కొత్త శరీరం శిక్షలను అనుభవిస్తుంది. ఇది న్యాయానికి విరుద్ధం. పునరుత్థానం జరిగేది కొత్త శరీరాలపై కాదు, కానీ అది తిరిగి లేపబడిన శరీరాల పైనే (ఆత్మను, దాని పాత శరీరంలోనే పునః ప్రవేశింపజేయడం) అని దివ్య గ్రంథాలు మరియు వివేకవంతులు సాక్ష్యమిస్తున్నాయి.

మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు తిరిగి ఎలా లేపబడతాడు ?

ప్రశ్న: పునరుత్థానం ఎలా జరుగుతుంది? మానవుడు చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహము వంటి క్రూరమృగాలు తినేయటం వలన, దాని మాంసం వాటి శరీరంలో రక్తంగా మారి  ప్రవహిస్తూ ఉండి ఉండవచ్చు ….

జవాబు: అల్లాహ్ – ఏకైకుడు, ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉంది – ఆయన ఏకైకుడు, ఆయన ‘అయిపో’ అంటే చాలు, అది అయిపోతుంది.

చెల్లాచెదురుగా విసిరి వేయబడిన, తినబడిన లేక గాలిలో కలిపి వేయబడిన మృతదేహాలను తిరిగి ఏకం కమ్మనే ఆయన ఆజ్ఞతో, అవి తిరిగి శరీరంగా ఏర్పడిపోతాయి. దీనిని విశ్వసించడమనేది కూడా పూర్వం పేర్కొనబడిన ఈ క్రింది మూలసిద్ధాంతం పైనే ఆధారపడి ఉంది,

‘గైబ్ (అగోచర విషయాల) గురించిన వార్తలన్నింటినీ అలాగే అంగీకరించడం మానవులపై తప్పనిసరిగా చేయబడింది (ఎలా లేక ఎందుకు అని ప్రశ్నించకుండా)’

ప్రజలు నగ్నపాదాలతో, నగ్నంగా మరియు సుంతీ చేయబడని స్థితిలో తిరిగి లేపబడతారనే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులు విని, ఆయేషా రదియల్లాహు అన్హా అడుగుతారు, “పురుషులు మరియు స్త్రీలు ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ ఉంటారా?”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు, “అప్పటి పరిస్థితి ఒకరి వైపు మరొకరు చూసుకోవడం కంటే చాలా గంభీరంగా ఉంటుంది (తీర్పు భయంతో ఒకరినొకరు పట్టించుకునే స్థితిలో ఉండరు)”.

కాబట్టి, ఆ రోజు ఒకరి వైపు మరొకరు చూసుకునే స్థితిలో ఉండరు. ఎందుకంటే ఖుర్ఆన్ లోని అల్లాహ్ పలుకులు ఇలా తెలుపుతున్నాయి, “ఆ రోజు మానవుడు తన సోదరుడి నుండి, తన తల్లి నుండి, తన తండ్రి నుండి, తన భార్య నుండి, తన సంతానం నుండి దూరంగా పారిపోతాడు. ప్రతి వ్యక్తీ – ఆ రోజున – ఇతరులను పట్టించుకోలేనంత ఘోర స్థితిలో ఉంటాడు” 80:34-37. అతను ఎంత భయకరమైన పరిస్థితిలో ఉంటాడంటే, తన స్వంత బిడ్డలను మరియు బంధువులను కూడా పట్టించుకోలేడు. “శంఖం ఊదబడినపుడు, వారి మధ్య ఎలాంటి బంధుత్వం మిగిలి ఉండదు, ఒకరి గురించి మరొకరు అడగను కూడా అడగలేరు” 23:101

دنو الشمس من الخلائق بمقدار ميل

  1. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం

అంతిమ దినం గురించిన మేము విశ్వసించే దానిలో సూర్యుడు తన సృష్టికి అతి దగ్గరగా – ఎంత దగ్గరగా అంటే ఒక మీలు దూరమంత దగ్గరా తీసుకు రాబడతాడని మేము విశ్వసిస్తాము. మీలు అంటే మహిళలు తమ కంటిలో కాటుక రాసుకోవబడానికి వాడే పుల్ల లేక ఒక మైలు దూరం – ఈ రెండు పరిస్థితులలోనూ – సూర్యుడు ప్రజల నెత్తి మీద ఉంటాడు.

అంతిమ తీర్పుదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?

ప్రశ్న: ఒకవేళ సూర్యుడు మన వైపుకు ఒక చేతి దూరం జరిగినా అది భూమిని దగ్దం చేసివేస్తుందనేది ఈ రోజు మనకు తెలిసిన విషయం. మరి సృష్టికి మీలు దూరమంత దగ్గరగా సూర్యుడు తీసుకు రాబడటం ఎలా సాధ్యం?

జవాబు: ఒక విశ్వాసి యొక్క బాధ్యత మరియు మన విశ్వాసం తప్పని సరిగా క్రింది నియమంపై ఆధారపడి ఉండాలి,

“అగోచర (గైబ్) విషయాలను ఎలా మరియు ఎందుకు అని ప్రశ్నించకుండా వాటిని అంగీకరించడం”

అగోచర విషయాలను మీ ఊహలు అందుకోలేవు. అందువలన వాటిని అంగీకరించడం మరియు ఇలా అనడం మీపై తప్పనిసరి విధి, ‘మేము విశ్వసించాము మరియు సాక్ష్యమిస్తున్నాము – తీర్పు దినం నాడు సూర్యుడు సృష్టికి ఒక మీలు దూరమంత దగ్గరా తీసుకురాబడతాడు’. దీనిపై ఎలాంటి ప్రశ్నలైనా అడగడం బిదాఅ (నూతన కల్పితం) క్రిందికి వస్తుంది. అందుకనే అల్లాహ్ యొక్క ఇస్తివా (అల్లాహ్ తన సింహాసనాన్ని అధిరోహించడం) గురించి ప్రజలు ఇమాం మలిక్ రహిమహుల్లాహ్ ను ‘ఆయన ఎలా అధిరోహిస్తాడు (ఇస్తివా)?’ అని అడిగినపుడు, ఆయనిలా జవాబిచ్చారు, “దాని గురించి ప్రశ్నించడం బిదాఅ (నూతన కల్పితం)”.

అలాగే ఏ అగోచర విషయం గురించైనా ప్రశ్నించడం బిదాఅ క్రిందికి వస్తుంది. వాటి విషయంలో మనం వాటిని అంగీకరించడం మరియు సమర్పించుకోవడం మాత్రమే చేయాలి.

మరో జవాబు ఏమిటంటే – ఈ ప్రపంచంలో ఉండే బలహీన స్థితిలో మాదిరిగానే ఆరోజున శరీరాలు బలహీనంగా పునరుత్థరించబడవు – (వేడికి) తట్టుకోలేని బలహీనతతో. శరీరాలు సంపూర్ణ స్థితిలో పునరుత్థరించబడతాయి. అందు వలన ఒక్క రోజు 50 వేల సంవత్సరాలంత దీర్ఘంగా ఉండే ఆ తీర్పుదినం నాడు ప్రజలు అన్నపానీయాలు సేవించకుండా నిలబడి ఉంటారు – అలా నిలబడటం ఈ ప్రపంచంలో అసాధ్యం.

కాబట్టి, సూర్యుడు దగ్గరగా తీసుకు రాబడతాడు మరియు దాని సామీప్యాన్ని తట్టుకునే శక్తి శరీరాలకు ఇవ్వబడుతుంది – అలాగే 50 వేల సంవత్సరాలకు సమానమైన ఆ అంతిమ దినం నాడు అన్నపానీయాలు సేవించకుండా నిలబడే శక్తి కూడా.

(మరో ఉదాహరణ) – స్వర్గవాసులలో నుండి ఒక వ్యక్తి, వేల సంవత్సరాలు ప్రయాణించేటంత దూరంలో విస్తరించి ఉన్న తన సామ్రాజ్యం వైపు చూస్తాడు – తనకు అతి దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని చూడగలిగినంత స్పష్టంగా అతడు దాని చిట్టచివరి ప్రాంతాన్ని చూడగలడు – ఈ ప్రపంచంలో అలా చేయడం అసాధ్యం.

కాబట్టి, అంతిమదినంనాడు తిరిగి లేపబడే మన శరీరాల స్థితి ఈ ప్రపంచంలోని మన శరీరాల స్థితికి మధ్య చాలా భేదం ఉంది.

محاسبة الخلائق على أعمالهم

  1. ప్రజల కర్మల పత్రం

అల్లాహ్ అంతిమ దినాన్ని ‘యౌముల్ హిసాబ్’ అంటే లెక్క చూడబడే దినం అనే పేరుతో పిలిచినాడు. ఎందుకంటే, అది మానవజాతి కర్మల లెక్కలు చూడబడే దినం. అయితే ఆ లెక్క ఇద్దరు వ్యాపారుల మధ్య డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జరిగే బేరసారాల లెక్క వలే ఉంటుందా?

లేదు. ముమ్మాటికీ లేదు. విశ్వాసి కొరకు, కర్మల పత్రం లెక్క అల్లాహ్ యొక్క దయ, అనుగ్రహం మరియు కనికరాలతో చూడబడుతుంది. అల్లాహ్ విశ్వాసిని తన దగ్గరకు తీసుకుని, అతనిని కప్పి, అతని తప్పులను ఒప్పుకునేలా చేస్తాడు. అల్లాహ్ అతనితో అతను తను చేసిన పాపాన్ని ఒప్పుకునే వరకు మరియు ప్రాయశ్చిత పడే వరకు ఇలా అంటాడు, “నువ్వు ఫలానా రోజున ఈ పాపం చేసావు …”. అపుడు అల్లాహ్ అతనితో ఇలా అంటాడు, “నేను ప్రపంచంలో నీ పాపాలను దాచి వేసాను మరియు ఈరోజున వాటిని క్షమిస్తున్నాను.”

ఏ పాపమూ చేయకుండా జీవితం గడిపిన వారెవ్వరూ మనలో లేరు – గుప్తమైన పాపాలు (రెండు రకాలు) మన మనస్సుకు సంబంధించినవి. బహిరంగ పాపాలు మన శరీరాలకు సంబంధించినవి, అయితే ప్రజలు వాటిని చూడలేరు. బహశా ఎవరైనా చెడు చూపుతో దేనినైనా చూస్తున్నపుడు, అతడు అనుమతించబడిన ఉద్దేశ్యంతోనే దానిని చూస్తున్నాడేమోనని మీరు భావించవచ్చు – అసలు విషయం మీకు తెలీదు. కాబట్టి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “కళ్ళు చేసే చెడు మరియు మనస్సులలో దాగి ఉన్న చెడు అల్లాహ్ కు తెలుసు.” 40:19

కళ్ళు చేసే చెడు ఒకరి భావాలకు సంబంధించింది – దానిని ఎవ్వరూ కనిపెట్టలేరు – ఈ కన్ను అనుమతించబడిన మేరకే చూస్తుందనే విషయం ఎవరికి తెలుస్తుంది?

“మరియు మనస్సు దాచేదంతా” ఇది గుప్తమైంది. ‘నేను నీ కొరకు వాటిని ప్రపంచంలో దాచి వేసాను మరియు ఈనాడు నేను వాటిని నీ కొరకు క్షమించి వేసాను’ అని అల్లాహ్ పలికినాడు.

అవిశ్వాసి లెక్క ఈవిధంగా తీసుకోబడదు. వారు తమ తప్పులను ఒప్పుకునేలా చేయబడతారు మరియు వారితో ఇలా చెప్పబడుతుంది, “నీవు ఫలానా ఫలానా పాపం చేసావు”. ఒకవేళ వారు నిరాకరిస్తే, వారి నాలుకలు, చేతులు, కాళ్ళు వారు చేసిన పాపకార్యాల గురించి సాక్ష్యం పలుకుతాయి – వారి చర్మం కూడా వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది, “అపుడు వారు తమ చర్మంతో ఇలా అంటారు, ‘మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిస్తున్నారు?”

అపుడవి (ఆ శరీర భాగాలు) ఇలా అంటాయి, “అన్ని వస్తువులకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్ యే మాకూ మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఆయనే మిమ్ముల్ని తొలిసారి పుట్టించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు” అని అంటాయి. “మీరు రహస్యంగా పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా అల్లాహ్ కు కూడా తెలియవని అనుకునేవారు. మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్ముల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు”. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా (వహించకపోయినా), నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా క్షమించబడరు”. 41:21-24.

అవిశ్వాసులు తమ పాపకార్యాలను ఒప్పుకుంటారు. వారి కర్మల ఫలితంగా వారు అవమానానికి గురి చేయబడతారు. అపుడు సాక్షులు ఇలా సాక్ష్యమిస్తారు, “తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే” 11:18.

కాబట్టి, లెక్క తీసుకోవడంలో విశ్వాసి మరియు అవిశ్వాసికి మధ్య చూపబడే ఈ భేదాన్ని చూడండి.

ప్రశ్నఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?

జవాబు: అవును, ఒక సమూహానికి ఈ లెక్క నుండి మినహాయింపు ఉంటుంది. తనకు తన సమాజం మరియు వారిలో నుండి కర్మల లెక్క తీసుకోబడకుండానే స్వర్గంలో ప్రవేశించే 70,000 మంది చూపబడినారని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు. “వారు ఎవరంటే రుఖయ్యాను ఆశ్రయించని వారు, దుశ్శకునాలను నమ్మనివారు మరియు పచ్చ పొడవబడని వారు; వారు తమ ప్రభువునే నమ్ముకున్న వారు. …” (సహీహ్ అల్ బుఖారీ)

توزن الأعمال يوم القيامة بميزان

  1. త్రాసు

“ఆ రోజు బరువు (తూకం) కూడా సత్యమే.” 7:8

“మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాం” 21:47

తీర్పుదినం రోజున రెండు పళ్లాలున్న త్రాసులో కర్మలు తూచబడతాయి, ఒక పళ్లెంలో మంచిపనులు ఉంచబడతాయి మరియు రెండో పళ్లెంలో చెడు పనులు.

పై ఆయతులను బట్టి, మన కర్మలు తూచబడతాయని అర్థమవుతున్నది. “కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.” 99:7-8

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “రెండు వచనాలు అల్లాహ్ చాలా ఇష్టమైనవి, నాలుకపై తేలికగా పలుకబడతాయి, కానీ త్రాసులో చాలా బరువుగా ఉంటాయి,

سبحان الله و بحمده، سبحان الله العظيم

సుబ్ హానల్లాహు బి హమ్దిహి, సుబ్ హానల్లాహిల్ అజీమ్.” (సహీహ్ బుఖారీ)

కాబట్టి సృష్టితాల కర్మలు తూచేందుకు ఈ త్రాసు ఏర్పాటు చేయబడుతుంది.

ప్రశ్నత్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా !

జవాబు: దీనికి జవాబు ఇంతకు ముందు పేర్కొన్న ‘ఎలా మరియు ఎందుకు అని అడుగకుండా వాటిని అంగీకరించడం మరియు సమర్పించుకోవడం మనపై తప్పనిసరి చేయబడింది’ అనే మూలసిద్ధాంతమే.

అయితే, పండితులు ఈ ప్రశ్నకు జవాబిస్తూ, కర్మలకు ఆకారాలుంటాయని మరియు అవి పళ్లెంలో ఉంచబడతాయని తెలిపారు. కర్మలు బరువుగా ఉండవచ్చు లేక తేలికగా ఉండవచ్చు. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన సహీహ్ ముస్లింలోని హదీథును పండితులు ప్రామాణికంగా ఇలా పేర్కొన్నారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు “కొమ్ములతో ఉన్న ఒక పొట్టేలు ఆకారంలో మరణం తీసుకు రాబడుతుంది. స్వర్గం మరియు నరకం మధ్య అది నిలబెట్టబడిన తర్వాత ఇలా ప్రకటించబడుతుంది, ‘ఓ స్వర్గవాసులారా! ఇదేమిటో మీకు తెలుసా?’ అపుడు వారు తల పైకెత్తి, దానిని చూసి, ఇలా అంటారు, ‘తెలుసు, ఇది మరణం’.

మరలా ఇలా ఘోషించబడుతుంది, ‘ఓ నరకవాసులారా! ఇదేమిటో మీకు తెలుసా?’ అపుడు వారు తమ తలలు పైకెత్తి, దానిని చూసి, ఇలా అంటారు, ‘తెలుసు, ఇది మరణం’. అపుడు మరణాన్ని వధించమనే ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఇలా ఘోషించబడుతుంది, ‘ఓ స్వర్గవాసులారా, ఇది (మీకోసం స్వర్గం) శాశ్వతం. ఇక మరణం లేదు. ఓ నరకవాసులారా, ఇది (మీ కోసం స్వర్గం) శాశ్వతం. ఇక మరణం లేదు…’ ”

మరణం అనేది స్వభావమని మనందరికీ తెలుసు. కానీ, అల్లాహ్ దానికి దాని ఆకారాన్ని ఇస్తాడు. అలాగే, కర్మలకు కూడా. (వాటికి వాటి ఆకారం ఇవ్వబడుతుంది)

ప్రశ్న: అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?

జవాబు: ఈ విషయం గురించి పండితులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కొరకు ఒక త్రాసు ఏర్పాటు చేయబడుతుందని  తెలిపే వచనాలున్నాయి మరియు అందరికీ ఒకే త్రాసు ఏర్పాటు చేయబడుతుందని తెలిపే వచనాలూ ఉన్నాయి. ఉదాహరణకు,

“మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాం” 21:47

“ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు” 7:8

మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథులోని, “త్రాసు పై బరువుగా ఉంటాయి” సహీహ్ బుఖారీ

కొందరు పండితుల అభిప్రాయం ఏమిటంటే, త్రాసు ఒక్కటే ఉంటుంది కానీ అందులో తూచబడే వాటిని బట్టి లేక సమాజాలను బట్టి అనేక రూపాలలో ఉంటుంది అంటే ఒక త్రాసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క కర్మలు తూచబడతాయి, మరో త్రాసులో ప్రవక్త మూసా అలైహిస్సలాం సమాజం యొక్క కర్మలు తూచబడతాయి, మరొక త్రాసులో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం సమాజం యొక్క కర్మలు తూచబడతాయి…

అనేక రకాల త్రాసులుంటాయని భావించే పండితులు చెప్పేదేమిటంటే ప్రతి సమాజం కొరకు అల్లాహ్ ఒక త్రాసును నెలకొల్పుతాడు లేదా (ఆయన వేర్వేరు త్రాసులను) విధిగా చేయవలసిన కర్మల కోసం మరియు (వేరే త్రాసును) సున్నతు ఆచరణల కోసం ఏర్పాటు చేస్తాడు.

అసలు విషయం అల్లాహ్ కే తెలుసు. అయితే త్రాసు ఒక్కటే ఉండవచ్చు మరియు దానిలో తూచబడే వాటిని అనుసరించి అది అనేక విధాలుగా ఉండవచ్చు.

نشر الكتاب بين الناس

  1. కర్మ పత్రాల పంపిణీ

కర్మల పత్రాలు ప్రజలకు ఇవ్వబడతాయి మరియు అవి ఇవ్వబడే పద్ధతిలో భేదం ఉంటుంది. కొందరికి అవి వారి కుడిచేతులలో ఇవ్వబడతాయి మరియు మరికొందరికి అవి వారి ఎడమ చేతులలో ఇవ్వబడతాయి. ఖుర్ఆన్ లోని సూరతుల్ హఖ్ఖ్ లో అల్లాహ్ దీని గురించి ఇలా తెలుపుతున్నాడు,

“మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతనంటాడు, ‘ఇదిగో నా కర్మల పత్రాన్ని చదవండి. నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది.’ మరి అతను మనసు మెచ్చిన సంతోష జీవితం గడుపుతూ ఉంటాడు. ఉన్నతమైన స్వర్గవనంలో. దాని పండ్లు అతి దగ్గరగా వ్రేలాడుతూ ఉంటాయి. ‘గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి’ (అని వారితో అనబడుతుంది)

ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతను ఇలా అంటాడు: ‘అయ్యో, నా కర్మల పత్రం నాకివ్వబడ కుండా ఉంటే ఎంత బావుండేది. అయ్యో, నా చావే (నా వ్యవహారాన్ని) తేల్చేసి ఉంటే బాగుండేదే. నా ధనం మాకే మాత్రం అక్కరకు రాలేదు. నా అధికారం నానుండి చేజారి పోయిందే’. (అని బాధపడతాడు) 69: 19-29

 ఈ పుస్తకంలో మానవజాతి కర్మలు లిఖించబడతాయి. దీని గురించి ఖుర్ఆన్ లోని అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “ఎన్నటికీ కాదు, మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు. నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు.” 82: 9-11

మానవుడు ఇలా ఆదేశించబడతాడు, “(ఇదిగో) నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో. ఈరోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు.” 17:14

కొందరు పండితులిలా అన్నారు (ఈ వచనం అర్థం ఏమిటంటే), “మిమ్మల్నే మీ లెక్క తీసుకునే వానిగా చేసి, అల్లాహ్ మీకు న్యాయం చేసాడు”

ప్రశ్న: తీర్పు దినం నాడు కర్మపత్రాలు కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడతాయని విశ్వసించడం మనపై తప్పని సరి. కానీ సూరతుల్ ఇంషిఖాఖ్ లో అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “ఎవరి పుస్తకమైతే అతని వెనుక వైపు నుండి ఇవ్వబడుతుందో” 84:10

సూరతుల్ హఖ్ఖ్ లోని “ఎవరికైతే అతని పుస్తకం ఎడమచేతిలో ఇవ్వబడుతుందో” 84:25 అనే వచనం మరియు “ఎవరి పుస్తకమైతే అతని వెనుక వైపు నుండి ఇవ్వబడుతుందో” 84:10 అనే వచనాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎలా పరిష్కరించగలం ?

జవాబు: అవిశ్వాసి తన కర్మల పుస్తకాన్ని తన ఎడమ చేతితోనే తీసుకుంటాడు, కానీ అతని ఎడమ చేయి అతని వీపు భాగంలో ఉంటుంది. ఇది అతను చేసిన పనికి (అల్లాహ్ గ్రంథాన్ని తన వీపు వెనుక పెట్టడం) పరిహారం. కాబట్టి ఎలాగైతే అతను అల్లాహ్ గ్రంథాన్ని తన వీపు వెనుక వదిలి వేసాడో, తీర్పు దినాన అతని కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుంది – అతని చర్యకు ప్రతి చర్యగా.

حوض النبي، صلى الله عليه و سلم

  1. అల్ హౌద్ (ప్రత్యేక సరస్సు)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరస్సు చాలా విశాలమైంది – ఓ అల్లాహ్! దానిలో నుండి త్రాగే వారిలో మమ్మల్ని కూడా చేర్చు గాక. దాని పొడవు మరియు వెడల్పు ఒక నెల ప్రయాణానికి సమానమైన దూరంలో ఉంటుంది. దాని నీరు పాల కంటే ఎక్కువ తెల్లగా, తేనె కంటే ఎక్కువ తియ్యగా మరియు కస్తూరి సువాసన కంటే ఎక్కువ సువాసనతో ఉంటాయి. ఎవరైతే ఈ సరస్సు నుండి త్రాగుతారో, వారికి ఇక ఎన్నడూ దాహం వేయదు. ఈ సరస్సు యొక్క నీరు అల్ కౌథర్ నుండి వస్తుంది. అల్ కౌథర్ అనేది స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడే ఒక నది. దీని యొక్క రెండు పాయలు అల్ హౌద్ సరస్సులోనికి వస్తాయి. అల్ హౌద్ ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. విశ్వాసులు దాని వద్దకు వస్తుంటారు మరియు దాని నీరు త్రాగుతూ ఉంటారు. తీర్పు దినం నాడు వేడి మరియు అలసట వలన ప్రజలు బాధపడుతూ ఉండే సమయంలో, ఈ హౌద్ ప్రజలు సమావేశపరచబడే చోట ఉంటుంది. అల్లాహ్ అనుమతించిన వారు ఇందులో నుండి త్రాగుతారు మరియు ఇక ఎన్నడూ వారికి దాహం వేయదు.

الشفاعة و شروطها

  1. షఫా (విముక్తి, మోక్షం)

షఫా రెండు రకాలు:

మొదటిది–కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది.

రెండోది– మొత్తం ప్రవక్తలు, సిద్ధీఖులు, షహీదులు మరియు సజ్జనులందరి కొరకు ప్రత్యేకించబడిన సాధారణ షఫా.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ప్రత్యేకించబడిన షఫా – అల్ షఫా అల్ ఉధమా. అది లెక్క ప్రారంభించేందుకు ఉద్దేశించబడింది. తీర్పుదినం నాడు, తమ తలలపై సూర్యుడు ఒక మీలు దూరమంత దగ్గరలో ఉండటం, అలా 50,000 యేళ్ళ నుండి నిలుచొని ఉండటం వలన ప్రజలను అవస్త, వేదన మరియు బాధలచే చుట్టుముట్టి ఉంటాయి. వారిలో కొందరు చెమటలో మునిగి ఉంటారు.

అపుడు ప్రజలు తమ తరుఫున అల్లాహ్ వద్ద సిఫారసు చేసి, తమను ఈ యాతన నుండి విముక్తి చేసే వారెవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటారు. వారు ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం వద్దకు వెళతారు. అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని వారు ఆయనను అడుగుతారు, కానీ అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లఘించి, నిషేధించబడిన చెట్టు నుండి తినడం ద్వారా అల్లాహ్ కు అవిధేయత చూపిన కారణంగా ఆదం అలైహిస్సలాం అందుకు నిరాకరిస్తారు.

ప్రశ్న: నిషేధించబడిన చెట్టు నుండి తినడం అనేది ఆదం అలైహిస్సలాం చేసిన పాపమే, అయితే వెంటనే ఆయన పశ్చాత్తాపబడి, క్షమాపణ అర్థించారు. తర్వాత అల్లాహ్ ఆయనను ఎంచుకున్నాడు మరియు ఆయనకు మార్గదర్శకత్వం ప్రసాదించినాడు. “ఆదమ్ తన ప్రభువు మాటను జవదాటి, దారి తప్పాడు. దరిమిలా అతని ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అతనికి మార్గం చూపాడు”. 20: 121-122 (అల్లాహ్ అతని తప్పును మన్నించినా, ఆదం అలైహిస్సలాం అల్లాహ్ వద్ద సిఫారసు చేసేందుకు వెళ్ళటాన్ని ఎందుకు నిరాకరిస్తాడు ?)

జవాబు: అవును. ఆదం అలైహిస్సలాం తప్పు చేసి, పశ్చాత్తాప పడిన తర్వాత అల్లాహ్ ఇలా ప్రకటించాడు, “అపుడు ఆయన ప్రభువు ఆయనను ఎన్నుకున్నాడు” మరియు ఆయనను  సన్మార్గగాములలోని వానిగా చేసాడు. కానీ, ఆదం అలైహిస్సలాం తను చెట్టు నుండి తిన్నాననే సాకు చెప్పి, సిఫారసు కొరకు వెళ్ళేందుకు నిరాకరిస్తారు. ఎందుకంటే సిఫారసు చేసే స్థానం చాలా ఉన్నతమైంది. అందుకని సిఫారసు చేసే ఆయన చాలా పరిశుద్ధంగా, ప్రతి దానిలో ఉత్తముడిగా ఉండవలసి ఉంటుంది. దీనికి కారణం సిఫారసు చేసే వ్యక్తి, ఇతరుల తరుఫున సిఫారసు చేయడం. కాబట్టి, ఒకవేళ తనే స్వయంగా దోషి అయినపుడు, ఇతరుల తరుఫున ఎలా సిఫారసు చేయగలడు?

అపుడు ప్రజలు నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళి, సిఫారసు చేయమని వేడుకోగా, ఆయన కూడా నిరాకరిస్తారు. ఎందుకంటే ఒకసారి ఆయన తనకు జ్ఞానం లేని దాని కొరకు అల్లాహ్ ను అర్థించి ఉన్నారు. మునిగి పోకుండా అవిశ్వాసి అయిన తన కుమారుడిని కాపాడమని ఆయన అల్లాహ్ ను ఇలా ప్రార్థించి ఉన్నారు, “నా ప్రభూ! నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా! నిశ్చయంగా నీ వాగ్దానం సత్యమైనది. నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు” అని విన్నవించుకున్నాడు. దీనికి సమాధానంగా, “ఓ నూహ్! ముమ్మాటికీ వాడు నీ కుటుంబీకుడు కాడు. వాడి పనులు ఏ మాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడుగకు. (ఈ విధంగా అడిగి) నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” అని అల్లాహ్ పలికాడు 11:45-46. కాబట్టి సిఫారసు చేసేందుకు నూహ్ అలైహిస్సలాం తిరస్కరిస్తారు.

అపుడు ప్రజలు ఖలీలుల్లాహ్ అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళతారు. ఆయన కూడా సిఫారసు చేసేందుకు నిరాకరిస్తారు. ఎందుకంటే ఆయన మూడు సార్లు అబద్ధం పలికి ఉన్నారు – అయితే, వాస్తవానికి అవి అబద్ధాలు కావు. బయటికి అవి సత్యాలే అయినా లోలోపలి ఆయన ఉద్దేశ్యం బహిరంగ సత్యానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి కొంత వరకు అవి అబద్ధాలను పోలి ఉన్నాయి. అల్లాహ్ పై తన యొక్క పరిపూర్ణ మర్యాద వలన ఇబ్రాహం అలైహిస్సలాం  సిఫారసు కొరకు వెళ్ళకుండా నిరాకరిస్తారు.

అపుడు ప్రజలు మూసా అలైహిస్సలాం వద్దకు వెళతారు. ఆయన కూడా సిఫారసు కొరకు వెళ్ళడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఆజ్ఞాపించబడకుండానే ఆయన ఒక వ్యక్తిని హత్య చేసినారు. ఆ వ్యక్తి అన్యాయంగా చంపబడ్డాడు. ఒకసారి మూసా అలైహిస్సలాం బయటికి వచ్చారు, ఆయనకు ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం కనబడింది; ఒకతను అతని వర్గమైన బనీ ఇస్రాయీల్ కు చెందిన వాడు మరియు రెండో వ్యక్తి అతని శత్రుపక్షమైన అఖ్బాత్ కు చెందినవాడు. ఆయన అనుచరుడు అతని శత్రువుపై చేస్తున్న పోట్లాటలో మూసా అలైహిస్సలాం సహాయం కోరతాడు. మూసా అలైహిస్సలాం చాలా బలమైన వారు. ఎపుడైతే ఆయన అతనిని త్రోస్తారో, ఆ వ్యక్తి చనిపోతాడు. ఆదేశించబడక ముందే అతనిని అలా చంపినందు వలన మూసా అలైహిస్సలాం సిఫారసు కొరకు వెళ్ళేందుకు నిరాకరిస్తారు.

అపుడు ప్రజలు ఎలాంటి పాపం చేయని ఈసా అలైహిస్సలాం వద్దకు వెళ్లగా, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థాయిని ముందుగానే గుర్తించి ఉండటం వలన, వారితో ఇలా పలుకుతారు, “ముహమ్మద్ వద్దకు వెళ్ళండి –ఆయన యొక్క భూత భవిష్య పాపాలన్నింటినీ అల్లాహ్ క్షమించివేసి ఉన్నాడు.” అపుడు ప్రజలు  రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి, సిఫారసు చేయమని అడుగుతారు.

అపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్ద తీర్పుదినాన్ని ప్రారంభించిమని అల్లహ్ ఉపదేశించిన ప్రార్థనతో అర్థిస్తారు. ఆయన అర్థింపును స్వీకరించి, అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి దిగుతాడు. ఈ విధమైన సిఫారసును అల్ షఫా అల్ ఉధ్మా (గొప్ప సిఫారసు) అంటారు. ఇంతటి గొప్ప సిఫారసు చేసే హక్కే అల్లాహ్ తెలిపిన క్రింది వచనాలలోని అల్ మఖామ్ అల్ మహ్మూద్, “త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్మూద్ (ప్రశంసాత్మక స్థానానికి) చేరుస్తాడు”  17:79

ఆ విధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు మరియు తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి అల్లాహ్ దిగి వస్తాడు మరియు వారిని (ఎంతో కాలంగా) నిలబడి ఉండిన బాధ నుండి వారిని అల్లాహ్ విముక్తి చేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ప్రత్యేకించబడిన షఫాలో స్వర్గవాసుల ప్రజల కోసం సిఫారసు చేయడం కూడా ఉంది. పుల్ సిరాత్ (ప్రత్యేక వంతెన) పై నుండి దాటి పోయిన తర్వాత, స్వర్గవాసులు స్వర్గద్వారం వద్దకు చేరుకుంటారు. అయితే ఆ ద్వారానికి తాళం వేయబడి ఉంటుంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గద్వారం తెరవమని అల్లాహ్ ను ఇలా వేడుకుంటారు. “మరెవరైతే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకున్నపుడు దాని ద్వారాలు తెరవబడతాయి” 39:73

‘తుదకు వారు అక్కడకు చేరుకున్నపుడు దాని ద్వారాలు తెరవబడతాయి’ అనే వంటి పలుకులనే అల్లాహ్ నరకవాసుల గురించి పలుకకుండా, ఇలా పలికాడు “ఎవరైతే అవిశ్వసించారో, వారు గుంపులు గుంపులుగా నరకంలోనికి చేరుకునే వరకు తోలబడతారు, అప్పటికే నరక ద్వారాలు తెరవబడి ఉంటాయి.” 39:71

స్వర్గవాసుల గురించి అల్లాహ్ ‘తుదకు వారు అక్కడకు చేరుకున్నపుడు దాని ద్వారాలు తెరవబడతాయి’ అని పలికినాడు. ఎందుకంటే, స్వర్గద్వారాలు సిఫారసు చేయబడే వరకు తెరవబడవు.

ప్రవక్తల, సత్యవంతుల (సిద్ధీఖుల), షహీదుల మరియు సజ్జనుల సామాన్య షిఫా రెండు విధాలుగా ఉంటుంది:

మొదటిది: నరకాగ్ని నుండి విశ్వాసులను తప్పించే షిఫా.

రెండోది: నరకాగ్ని శిక్షకు గురయ్యే విశ్వాసులను నరకం నుండి కాపాడే షిఫా.

షఫా షరతులు

షిఫా షరతులు మూడు:

  1. సిఫారసు చేసే వానిపై అల్లాహ్ యొక్క సంతృప్తి
  2. సిఫారసు చేయబడే వానిపై అల్లాహ్ యొక్క సంతృప్తి
  3. అల్లాహ్ యొక్క అనుమతి

దీని ఋజువు,

“ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వాళ్ళ సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో, తాను కోరిన వారి విషయంలో (సిఫారసు వినడానికి) సమ్మతిస్తే అది వేరే విషయం.”  53:26

“సిఫారసు వినడానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు” 21:28

“… ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడెవడు …” 2:255

“ఆరోజు కరుణామయుడు ఎవరికయినా అనుమతించి, అతని మాటను (వినడానికి) ఇష్టపడితే తప్ప – ఎవరి సిఫారసూ చెల్లనేరదు” 20:109

ఈ షఫా అవిశ్వాసులకు ప్రయోజనం కలిగించదు. ఎందుకంటే అల్లాహ్ వారి గురించి సంతృప్తి చెందడు. సిఫారసు చేయబడే వాని గురించి అల్లాహ్ సంతృప్తి చెందడమనేది షఫా షరతులలోని ఒక షరతు. కాబట్టి, ‘అల్లాహ్ వద్ద ఇవి మా కొరకు సిఫారసు చేస్తాయి’ అంటూ అవిశ్వాసులు పూజించిన ఆ విగ్రహాలు, తమ భక్తులకు ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేవు. అంతేగాక, వారి బాధను ఇంకా పెంచుతాయి. ఎందుకంటే అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “(ఓ అవిశ్వాసులారా) మీరూ, అల్లాహ్ ను వదిలి మీరు పూజించే మీ దైవాలు – అందరూ నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానికి ఆహుతి కావలసినవారే” 21:98. కాబట్టి, నరకాగ్నికి ఇంధనంగా మారిన వారి విగ్రహాలు ఆ అవిశ్వాసుల బాధను మరింతగా పెంచుతాయి.

الصراط، و هو عبارة عن جسر ممدود على النار

  1. పుల్ సిరాత్ (వంతెన)

పుల్ సిరాత్ అనేది నరకాగ్ని పై నిర్మించబడిన ఒక వంతెన. తమ కర్మలను అనుసరించి ప్రజలు దానిని దాటుతారు; కొందరు రెప్పపాటు కాలంలో చాలా వేగంగా దాటుతారు, కొందరు కాంతి వేగంతో దాటుతారు, మరికొందరు గాలి వేగంతో దాటుతారు. ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఎలాంటి ఆలస్యం చేయలేదో, అలాంటి వారు సిరాత్ ను త్వరత్వరగా దాటుతారు మరియు ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఆలస్యం చేస్తారో, అలాంటి వారు సిరాత్ ను చాలా నిదానంగా దాటుతారు. కేవలం విశ్వాసులు మాత్రమే సిరాత్ వంతెనను దాటుతారు, నరకవాసులు కావటం వలన అవిశ్వాసులు దానిని దాటలేరు – నరకం నుండి కాపాడమని మనం అల్లాహ్ శరణు వేడుకుందాము – దాహంతో బాధ పడుతూ వారు నరకంలోనికి చేరుకుంటారు.

دخول الجنة أو النار

  1. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం

స్వర్గవాసులు స్వర్గంలోనికి మరియు నరకవాసులు నరకంలోనికి చేరుకునే అంతిమ దశ ఇది.

ప్రశ్న: స్వర్గం మరియు నరకం ఇప్పుడు ఉనికిలో ఉన్నాయా ?

జవాబు: ఉన్నాయి. ఖుర్ఆన్ మరియు సున్నతులలో తెలిపి నట్లుగా స్వర్గనరకాలు ఈనాడు ఉనికిలో ఉన్నాయి. నరకాగ్ని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “నరకాగ్నికి భయపడండి, అది అవిశ్వాసుల కొరకు తయారుచేయబడింది” 3:131. ఇక్కడ తయారుచేయబడింది అంటే తయారుగా ఉందని అర్థం.

స్వర్గం గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. దాని వెడల్లు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది” 3:133. ఇక్కడ తయారు చేయబడింది అంటే తయారుగా ఉంది అని అర్థం.

సున్నతులలోని నిదర్శనాలు రెండు సహీహ్ హదీథు గ్రంథాలలో మరియు ఇతర హదీథు గ్రంథాలలో పేర్కొనబడి ఉన్నాయి. ఉదాహరణకు – సూర్యగ్రహణం సంభవించినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కొరకు నిలుచున్నారు. స్వర్గనరకాలు ఆయనకు చూపబడినాయి. ఆయన ఎంతసేపు స్వర్గాన్ని చూస్తూ ఉన్నారంటే, దానిలో నుండి ఒక ద్రాక్షగుత్తి తీసుకోవాలని ఆయనకు అనిపించింది, కానీ ఆయన అలా తీసుకోలేదు. అలాగే ఆయనకు నరకాగ్ని చూపబడింది. అందులో తన కడుపులో నుండి వ్రేలాడుతున్న ప్రేగులను పట్టుకుని ఈడ్చబడుతున్న అమర్ ఇబ్నె లుహై అల ఖుజాయీ ను ఆయన చూస్తారు. నరకాగ్ని నుండి మనం అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాము.

అతడు శిక్షించబడుతూ ఉంటాడు ఎందుకంటే అరబ్బులకు బహుదైవారాధనను పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి అతడే. ఫలితంగా, అతడు శిక్షించబడుతూ ఉంటాడు – అతడు పరిచయం చేసిన బహుదైవారాధన అనే ఘోర పాపానికి బదులుగా మరియు అతడి తర్వాత అది అనుసరించబడు తున్నందుకు గాను.

అంతేగాక నరకంలో శిక్ష అనుభవిస్తున్న ఒక స్త్రీని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తారు. ఆమె కట్టడిలో ఉన్న ఒక పిల్లికి తిండి పెట్టక పోవడమే గాక, కనీసం భూమి నుండి లభ్యమయ్యే వాటిని కూడా తినకుండా నిర్భందించడం వలన అది ఆకలితో చనిపోతుంది. (బుఖారీ & ముస్లిం)

స్వర్గనరకాలు ఉనికిలో ఉన్నాయనడానికి ఇవి నిదర్శనాలు.

ప్రశ్న: స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?

జవాబు: స్వర్గనరకాలు శాశ్వతం. అవి ఎప్పటికీ ఉంటాయి. స్వర్గం ఎల్లప్పుడూ ఉంటుందని ఖుర్ఆన్ లో తెలుపబడిన నిదర్శనం ఏమిటంటే, “అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారు, నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.” 98:7-8

అలాగే, నరకం ఎల్లప్పుడూ ఉంటుందని ఖుర్ఆన్ లో మూడు చోట్ల తెలుపబడింది.

“అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటం గానీ, ఏదైనా మార్గం చూపటం గానీ చేయడు. వారికి నరకమార్గం చూపటం తప్ప. వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా సులువు” 4:168-169

“అల్లాహ్ అవిశ్వాసులన శపించాడు. ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు.” 33:64-65

“అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరయినా అల్లాహ్ మాటను, ఆయన ప్రవక్త మాటను వినకపోతే వారి కొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.” 72:23

నరకాగ్ని నాశనం చేయబడుతుందనే అభిప్రాయం, నమ్మలేని చాలా బలహీనమైన అభిప్రాయమనేది ఖుర్ఆన్ లోని స్పష్టమైన వచనాల ద్వారా ఋజువు అయింది. అంతేగాక ఖుర్ఆన్ వచనాలు స్పష్టంగా తెలిపిన వాటికి భిన్నమైన అభిప్రాయాలపై ఆధారపడటం సాధ్యం కాదు. అసలు అలాంటి నిరాధారమైన వాటిని నమ్మే అనుమతి మనకు అనుమతించబడలేదు.

No comments:

Post a Comment